![]() |
![]() |
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ చిన్న అవకాశం చిక్కినా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే ఫైర్ బ్రాండ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య వివాదం మరోసారి భగ్గుమంది. వీరిద్దరి మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు ఏకంగా తల్లిదండ్రుల పెంపకం స్థాయికి వెళ్లిపోవడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఇటీవల జరిగిన ఒక సమ్మిట్ ఇంటర్వ్యూలో తాప్సీ పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో కంగనాతో ఉన్న విభేదాల గురించి ప్రశ్నించగా.. "ఆమె మాట్లాడే తీరు, ప్రవర్తన ఆమె పెంపకాన్ని మరియు పెరిగిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. నేను వ్యక్తిగతంగా మాట్లాడే తీరు నా పెంపకానికి అద్దం పడుతుంది" అని కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా తాప్సీపై విరుచుకుపడ్డారు. "ప్రమోషన్ల కోసం ప్రతీసారి నా పేరు వాడుకోవడమే కాకుండా, ఈసారి ఏకంగా నా తల్లిదండ్రులను, నా పెంపకాన్ని విమర్శించే స్థాయికి వెళ్లడం హద్దులు దాటడమే. నా తల్లిదండ్రుల్లా ఒక ఒరిజినల్ క్యారెక్టర్‌ను ఎందుకు తయారు చేయలేకపోయారో అని ఆమె తల్లిదండ్రులను చూస్తే జాలేస్తోంది" అంటూ ఘాటుగా రీకౌంటర్ ఇచ్చారు.
వాస్తవానికి 2019లో వచ్చిన 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా సమయం నుంచే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. అప్పట్లో కంగనా సోదరి రంగోలి, తాప్సీని "సస్తి కాపీ" (చౌకబారు నకలు) అని విమర్శించడం, ఆ తర్వాత నేపోటిజం చర్చలో "బి-గ్రేడ్ నటి" అని కంగనా అభివర్ణించడం తీవ్ర వివాదాస్పదమైంది.
ఇద్దరూ స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి 'అవుట్‌సైడర్స్'గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, విభిన్నమైన సిద్ధాంతాల కారణంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం తాప్సీ నటించిన యాక్షన్ డ్రామా 'గాంధారి' సెప్టెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
సినిమా ప్రమోషన్స్ సమయంలో రాజుకున్న ఈ కొత్త వివాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లిద్దరి మధ్య ఉన్న ఈ మాటల యుద్ధం ఇక్కడితో ముగుస్తుందా లేక మరింత ముదురుతుందా అని నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కంగనా సినిమాల్లో నటిస్తుండగా, తాప్సీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ మరియు థియేట్రికల్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.
![]() |
![]() |